- సొంత జాగా ఉంటే నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తం: మంత్రి పొంగులేటి
- ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామని వెల్లడి
- లబ్ధిదారుల ఎంపికకు యాప్: పొన్నం
- ముషీరాబాద్, జూబ్లీహిల్స్నియోజకవర్గాల్లో 81 మందికి పట్టాలు పంపిణీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో తొలివిడతగా 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాకారానికి చెందిన 81మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన అందజేశారు. రెండు బస్తీల్లో ఇరుకు ఇండ్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని కూల్చివేసిన సర్కారు.. అపార్ట్మెంట్లు కట్టించి ఇచ్చింది. కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే పేదలకు ఎక్కువ ఇండ్లు నిర్మించి తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలుపుతామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలను గుర్తించడానికి అధికారులు వస్తారని, వారికి పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. సొంత జాగా ఉన్నవారు ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుందని ఆయన చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు గాను ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ తీసుకొచ్చామన్నారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేస్తున్నామని చెప్పారు. పట్టాల పంపిణీలో దివ్యాంగులకు ఫస్ట్ ఫ్లోర్ లో ఇండ్లను కేటాయించామన్నారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, అడిషనల్కలెక్టర్ ముకుంద రెడ్డి, డీఆర్వో ఈ వెంకటాచారి, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రచన శ్రీ పాల్గొన్నారు.