పేదలకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్టార్ట్​

పేదలకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్టార్ట్​
  • ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్​గా నిధులు
  • గ్రీన్​చానల్​ ద్వారా మంజూరు చేస్తం:పొంగులేటి
  • సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్​
  • 32 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తి 
  • జిల్లాల‌‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామ‌‌కం
  • ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబ‌‌ర్‌‌, వెబ్‌‌సైట్‌‌
  • నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చి, పూర్తిచేయిస్తం
  • జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్​ స్వగృహ టవర్లు ఇస్తం
  • డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇందిరమ్మ స్కీమ్​పై మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్​చానల్​ ద్వారా స్పీడ్​గా నిధులు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. రాబోయే 4 ఏండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే అప్లికేషన్ల సర్వే వేగంగా సాగుతున్నదని, సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఈ స్కీమ్ అమలుకు ఇబ్బంది లేకుండా  ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.  మంగళవారం హిమాయత్ నగర్​లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్​లో సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఎండీ గౌతమ్​తోపాటు 33 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో ఇందిరమ్మ స్కీమ్, డబుల్ ఇండ్ల నిర్మాణంపై రివ్యూ చేపట్టారు. 

రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించారు. వీరికి మంత్రి పొంగులేటి చేతుల మీదుగా అపాయింట్ ఆర్డర్లు అందజేశారు. 6  నెలలుగా ఖాళీగా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ పోస్టును ఎస్ఈ చైతన్యకుమార్ కు పదోన్నతి ఇచ్చి భర్తీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు డైరెక్టర్ల (పీడీ)కు మొదటగా 3 టాస్క్ లు ఇస్తున్నామని, ఇందిరమ్మ యాప్ , మోడల్ హౌస్ , డబుల్ ఇండ్ల నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. పీడీలు వెంటనే కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని, నిత్యం వారితో టచ్ లో ఉండాలని ఆదేశించారు.  వచ్చే నెల చివరి నాటికి అన్ని మండలాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ లను పూర్తి చేయాలని సూచించారు. 

“ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకోసం ప్రజాపాలనలో 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.  సోమవారం నాటికి 32 లక్షల ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేసి, యాప్ లో అప్లికేషన్ల వివరాలను నమోదు చేశాం.  గత 5 రోజుల నుంచి రోజుకు 5 లక్షల చొప్పున అప్లికేషన్ల సర్వే పూర్తిచేస్తున్నం. వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు సర్వే ప్రకియ కంప్లీట్ చేస్తాం. అనంతరం లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ చేస్తం.  

ఇంటి నిర్మాణానికి అవసరం అయ్యే సిమెంట్, స్టీల్, ఇసుకను లబ్ధిదారులకు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు సప్లై చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. ఇంటి మీద ట్రై కలర్ తో పాటు పీఎం ఆవాస్ యోజన లోగో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా ”   అని మంత్రి పొంగులేటి తెలిపారు. జర్నలిస్టులు తీసుకుంటామంటే రాజీవ్ స్వగృహ టవర్లు తక్కువ ధరకు ఇస్తామని చెప్పారు. త్వరలో మీడియా అకాడమీ తరుఫున వెళ్లి చూసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ టవర్లను వేలం నిర్వహిస్తే ఎక్కువ ధర పలుకుతాయని వెల్లడించారు. 

హౌసింగ్ శాఖను పునరుద్ధరిస్తం

ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను గత సర్కారు నిర్వీర్యం చేసి ఆర్ అండ్ బీ లో కలిపేసిందని, ఉద్యోగులను ఇతర శాఖల్లోకి పంపించారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పటికే ఇతర శాఖలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లో పనిచేస్తున్న అధికారులను మాతృశాఖకు తీసుకొచ్చామని , శాఖ పునరుద్ధరణ పక్రియను సంక్రాంతి వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఇంజినీర్లను సైతం ఉపయోగించుకుంటామని మంత్రి వెల్లడించారు.

అవినీతి, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ భూమి లేనివారికి స్కీమ్ లో అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ ఇండ్ల కేటాయింపులో జరిగిన తప్పులు.. ఇప్పుడు జరగకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం త‌‌‌‌న  నిబంధ‌‌‌‌న‌‌‌‌ల మేర‌‌‌‌కు కొంత‌‌‌‌మందిని తిర‌‌‌‌స్కరించినా.. రాష్ట్ర ప్రభుత్వం త‌‌‌‌ర‌‌‌‌ఫున వారికి ఇండ్లు ఇస్తామని,  కేంద్రం విధించే నిబంధ‌‌‌‌న‌‌‌‌ల‌‌‌‌ను ఆమోదిస్తూ కేంద్ర నిధుల‌‌‌‌ను తీసుకుంటామని తెలిపారు. 

గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై పబ్లిక్ నుంచి ఫిర్యాదుల స్వీకరణకు తన చాంబర్​తోపాటు  సీఎంవో,  హౌసింగ్ సెక్రటరీ, ఎండీ చాంబర్ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇందుకు మూడు రోజుల్లో వెబ్ సైట్, 15 రోజుల్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  అధికారుల మీద ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. పేద ప్రజల నుంచి అధికారులు ఏం ఆశించవద్దని సూచించారు.

రాష్ట్రంలోని ఏ మారుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే త‌‌‌‌క్షణం స్పందించి, చ‌‌‌‌ర్యలు తీసుకుంటామని, ఫిర్యాదులపై స్టేటస్​ను ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు.  ఇప్పటికే గ్రామాలవారీగా రెవెన్యూ అధికారుల నియామ‌‌‌‌కానికి నిర్ణయించామని,  త్వర‌‌‌‌లో 1200 వ‌‌‌‌ర‌‌‌‌కు స‌‌‌‌ర్వేయ‌‌‌‌ర్లను నియ‌‌‌‌మిస్తామని వెల్లడించారు. 

డబుల్​ ఇండ్లను పూర్తిచేస్తం

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇండ్ల నిర్మాణం ఏ స్టేజ్ లో ఉన్నాయనే వివరాలు ఉన్నాయని,  పాత కాంట్రాక్టర్లు మిగతా పనులు పూర్తి చేస్తామంటే అంగీకరిస్తామని, లేకపోతే కొత్త కాంట్రాక్టర్లకు  అప్పగిస్తామని వెల్లడించారు.

ఇందుకు అవసరమయ్యే ఫండ్స్, పెండింగ్ బిల్స్ సైతం రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ ఇండ్లను లబ్ధిదారుడికే కేటాయించి, వారి పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఆదేశాలు ఇస్తామన్నారు. ఇలా చేస్తే లబ్ధిదారుడు తన ఇల్లు అని.. త్వరగా పూర్తయ్యేలా శ్రద్ధచూపిస్తారని తెలిపారు.