తొలి విడతో ఇంటి స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జనవరి 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల విధివిధానాలపై హన్మకొండ ఐడీవోసీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమన్నారు.
గత ప్రభుత్వం పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం లో నిరంతరం జరిగే ప్రక్రియ. గతంలో దరఖాస్తు చేసుకొని పక్షంలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. మొదటి విడతలో లబ్ధి చేకూరని వారికి తరువాత విడతల్లో లబ్ధి చేకూరుస్తాం. అర్హత ఉండి ప్రజాపాలన యాప్ లో నమోదు కానీ దరఖాస్తులు మ్యానువల్ గా నమోదు చేసుకోవాలని సూచించారు పొంగులేటి.
గత ప్రభుత్వం కొండలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చింది..తాము అలాంటి తప్పు చేయబోమన్నారు మంత్రి పొంగులేటి. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. జనవరి 16 నుంచి 26 వరకు గ్రామ సభలు పెట్టి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. జనవరి 26 నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేస్తామన్నారు. అధికారులు మొక్కుబడిగా కాకుండా రైతులను రాజు చేయాలనే తపన తో పని చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.