- నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తం: పొంగులేటి
ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు సమకూరుస్తామని, ప్రత్యేక యాప్ ద్వారా పథకాన్ని పర్యవేక్షిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ నెల 20 తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అన్నారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో మంత్రి సోమవారం పర్యటించారు. కూసుమంచిలో పార్టీ లీడర్లు, ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ, అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో 20 లక్షలకు తగ్గకుండా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మొదటి దశలో రేషన్‌కార్డు లేకున్నా ఇస్తం
గత ప్రభుత్వం పదేండ్లలో పేదలకు ఇండ్లు ఇవ్వకుండానే కాలం వెళ్లదీసిందన్నారు. మొదటి విడతలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని, రెండో విడత నుంచి రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. మహిళల పేరిట ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి నాలుగు దశలలో ప్రభుత్వం సాయం అందిస్తుందని, పునాది దశలో రూ.లక్ష, లెంటల్ లెవెల్ లో రూ.1లక్షా 25 వేలు, స్లాబ్ లెవల్లో రూ. 1లక్షా 75 వేలు, గృహప్రవేశం సమయానికి మరో రూ. లక్ష ఇస్తామన్నారు.