బఫర్ జోన్లో ఉంటే నా ఇల్లు కూల్చేయండి : మంత్రి పొంగులేటి సవాల్

బఫర్ జోన్లో ఉంటే నా ఇల్లు కూల్చేయండి : మంత్రి పొంగులేటి సవాల్
  •  బఫర్ జోన్లో ఉంటే యాక్షన్ తీసుకోండి
  •   ఇక్కడి  నుంచే హైడ్రా కమిషనర్ ను ఆదేశిస్తున్నా
  •   నేను మీలా లీజుకు తీసుకున్నానని చెప్పను
  •   అది నా కుమారుడి ఇల్లు.. అయినా నాదే
  •   కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
  •   ఒకరికి విమర్శించే అవకాశం ఎప్పటికీ ఇవ్వను
  •   మహిళా జర్నలిస్టులపై దాడి దురదృష్టకరం
  •   సీఎం నివేదిక కోరారు.. బాధ్యులపై చర్యలు

హైదరాబాద్: హిమాయత్ సాగర్ లోని తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తప్పుంటే తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేటీఆర్ లాగా లీజుకు తీసుకున్నానని చెప్పనని అన్నారు. వాస్తవానికి ఆ ఇల్లు తనది కాదని, తన కుమారుడిదని అన్నారు. అయినా తనదేనని ధైర్యంగా చెబుతున్నానని, తప్పుంటే కూల్చివేయాలని చెప్పారు. 

ఆ నాడు రేవంత్ రెడ్డి ఫాంహౌస్ పై డ్రోన్ తిప్పితే కేటీఆర్ కేసు పెట్టారని, ఇప్పుడు మాత్రం తనది కాదంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తెచ్చిందని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. దానికి స్పందించే తాను ఈ సవాలు విసురుతున్నట్టు చెప్పారు. పొంగులేటి ఒకరికి విమర్శించే అవకాశం ఇవ్వడని అన్నారు.