- మూడు దశల్లో వరంగల్ఔటర్ రింగ్ రోడ్ పనులు
- వరంగల్ మాస్టర్ ప్లాన్ పై మంత్రుల రివ్యూ
హైదరాబాద్ ,వెలుగు: వరంగల్ అభివృద్ధికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని వరంగల్ జిల్లా ఇన్ చా ర్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ ఆర్ డీ లో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్దిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ చేపట్టారు.
ఈ సమావేశంలో కొత్త మాస్టర్ ప్లాన్ , వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై చర్చించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌కు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
41 కిలోమీటర్ల పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని మొదటి దశలో 20 కిలో మీటర్లు, రెండో దశలో 11 కిలోమీటర్లు, మూడో దశలో 9 కిలోమీటర్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఓరుగల్లు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.