బీఆర్ఎస్ ప్రభుత్వం.. నన్ను ఇబ్బంది పెట్టింది

  • ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న 
  • బాధను దిగమింగి, అనుచరులకు ధైర్యం చెప్పా: పొంగులేటి 

ఖమ్మం, వెలుగు: గత ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో పొంగులేటి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గతేడాది ఇదే టైమ్ లో అప్పటి ప్రభుత్వం నన్ను, నా వాళ్లను అనేక ఇబ్బందులు, అవమానాలకు గురిచేసింది. ఆ సమయంలో నేను బాధను దిగమింగి, నా అనుచరులందరికీ ధైర్యం చెప్పాను. నేను బాధ పడితే, వాళ్లూ బాధపడతారని.. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాను” అని చెప్పారు. ‘‘ఏదీ వట్టిగా రాదు.

అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక సందర్భాల్లో నా కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, నేను బాధను దిగమింగుకొని వాళ్లకు ధైర్యం చెప్పాను. ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కార్చేవాడిని. ఆ కష్టం వట్టిగా పోలేదు. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది. ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుంది. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షలాగా ఉంటుంది” అని అన్నారు.

‘‘గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షకు గురయ్యారు. అందుకే నిరుద్యోగులందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మా ప్రభుత్వం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడింది. ఇప్పటికే ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్​ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర, ప్రొఫెసర్​చింతా గణేష్, ప్రసన్న హరికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.