విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట : పొంగులేటి, సీతక్క

  • ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం
  • ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సుడిగాలి పర్యటన
  • కేయూలో రూ.68 కోట్లతో డెవలప్​మెంట్​ వర్క్స్​కు శ్రీకారం
  • సిటీలో రూ.280.85 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హనుమకొండ, కాశీబుగ్గ, వెలుగు:  కాంగ్రెస్​ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క అన్నారు.  ఓరుగల్లు నగరంలో ముగ్గురు మంత్రులు ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.  కాకతీయ యూనివర్సిటీని సందర్శించి రూసా ఫండ్స్​నుంచి రూ. 6 కోట్లతో నిర్మించిన కే హబ్​ బిల్డింగ్​ ప్రారంభించారు.  రూ.2  కోట్లతో నిర్మించిన ఎస్టీ గర్ల్స్ హాస్టల్​, రూ.83 లక్షలతో ఏర్పాటు చేసిన పీవీ విజ్ఞాన కేంద్రం, రూ.2.4 కోట్లతో నిర్మించిన డైనింగ్​ హాల్​, రూ.1.93 కోట్లతో డెవలప్​ చేసిన అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్ సెకండ్​ ఫ్లోర్​, రూ.1.41 కోట్లతో కట్టిన ఆర్ట్స్​ కాలేజీలో ఎంబీఏ బిల్డింగ్​ ఫస్ట్​ ఫ్లోర్​ కు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.  

రూ.10 కోట్లతో నిర్మించనున్న  కాంపౌండ్​వాల్​, రూ.10  కోట్లతో కట్టనున్న ఎస్టీ బాయ్స్​ హాస్టల్​, రూ.10 కోట్లతో నిర్మించే ఎస్టీ గర్ల్స్​ హాస్టల్​, రూ.2.5 కోట్లతో జనగామ పీజీ సెంటర్​ అకడమిక్ బ్లాక్, కొత్తగూడలో అకడమిక్​ బ్లాక్​ ను రూ.2.97  కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ​ అనంతరం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో  రూ.280.85  కోట్ల  విలువైన పనులకు ప్రారంభోత్సవాలు,  శంకుస్థాపనలు చేశారు.  రూ 4.10 కోట్లతో  పుప్పాలగుట్టలో నిర్మించిన  ఈఎల్ఎస్ఆర్, రూ 20 లక్షలతో ఏర్పాటుచేసిన  ఫాతిమా నగర్ జంక్షన్ ను మంత్రులు ప్రారంభించారు. రూ.250 కోట్లతో వరద ముంపు నివారణ పనులు సహా మొత్తంగా రూ. 272. 12 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ డెవలప్​ మెంట్​ వర్క్స్​కు శంకుస్థాపన చేశారు.   

కేయూ అక్రమాలపై మంత్రులకు ఫిర్యాదు

 కేయూలో జరగుతున్న అక్రమాలపై యాక్షన్​ తీసుకోవాల్సిందిగా అకుట్​నేతలు  డా.మామిడాల ఇస్తారి, ప్రొఫెసర్​ బ్రహ్మేశ్వరి మంత్రులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీలో ప్రొఫెసర్ల పట్ల వీసీ, రిజిస్ట్రార్​ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.  ఉద్యోగ విరమణ వయసు పెంచినప్పటికీ యూనివర్సిటీలో అమలు కావడం లేదని వివరించారు. వర్సిటీల్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని కోరారు. పరిశోధక విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ ఫెలోషిప్ అమలు చేయాలంటూ  బీఎస్​ఎఫ్​ కేయూ ఇన్‌ఛార్జ్​, రీసెర్చ్​ స్కాలర్​ కళ్లెపల్లి ప్రశాంత్​ మంత్రి పొంగులేటికి వినతిపత్రం ఇచ్చారు. 

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని  కేయూ విద్యార్థి సంఘ నాయకుడు కామగోని శ్రావణ్ కోరారు. ప్రతి విద్యార్థికి హాస్టల్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్సిటీలను బలోపేతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  పీడీఎస్​యూ  ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి  బి.నరసింహరావు మంత్రులను కోరారు.  కాంట్రాక్ట్​ లెక్చరర్స్​ తమను రెగ్యులరైజ్​ చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వగా.. సమస్యలన్నింటికీ సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.  

ఎస్​ఎన్​ఎం క్లబ్​ లో మంత్రుల కార్యక్రమాన్ని కవర్​ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై వరంగల్ సెంట్రల్​ జోన్​ డీసీపీ ఎంఏ. బారీ అత్యుత్సాహం ప్రదర్శించి బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడున్న విలేకరులంతా ఆయన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, వరంగల్ వెస్ట్​ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి, మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళీనాయక్​, నగర మేయర్​ గుండు సుధారాణి,  కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, తూర్పాటి సులోచన సారయ్య, బైరబోయిన ఉమా దామోదర్,  అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో  కృష్ణవేణి, జీడబ్ల్యూఎంసీ ఎస్​ఈలు  కృషారావు, ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్​వో  డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

మూడేండ్లలో హరిత నగరంగా వరంగల్

వచ్చే మూడేండ్లలో వరంగల్​ ట్రై సిటీని హరిత నగరంగా మార్చుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. లక్ష వృక్షార్చన కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. నగర రహదారుల వెంట సంవత్సరంలో  లక్ష చెట్లు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లేఅవుట్ ఖాళీ ప్రదేశాలను థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.