అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత : మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి     

అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత : మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి     
  • 10 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పంపిణీ పూర్తి
  • ఈనెల లోపు అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతతో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తున్నామని మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం కూసుమంచి, ఖమ్మం రూరల్​ మండలాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో కలెక్టర్ ముజామ్మిల్  ఖాన్ తో కలిసి కూసుమంచి మండలానికి చెందిన 27 మందికి, తిరుమలాయ పాలెం మండలానికి చెందిన 52 మందికి కల్యాణలక్ష్మి, ​ షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మరో 10 రోజుల్లో ఇందిరమ్మ మొదటి విడత పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలాఖరు నాటికి అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ  రేషన్ కార్డు అందిస్తామని మంత్రి తెలిపారు. మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆడబిడ్డలకు తులం బంగారం కొద్దిగా సమయం పడుతుందని తెలిపారు. అనంతరం కూసుమంచి మండలం తుర్కగూడెం లో రూ.20 లక్షలతో, కేశవపురంలో రూ.10 లక్షలతో, గోపాలరావు పేటలో రూ.10.4 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ.9 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సబ్సిడీతో ఇచ్చే సంచార చేపల విక్రయం వాహనాన్ని పంపిణీ చేశారు.

తాగునీటి సరఫరా, మున్నేరు రిటైనింగు వాల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రోడ్డు మరమ్మతు, అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాగా కూసుమంచి మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.5.50 కోట్లను మంజూరు చేస్తూ ఉన్నత విద్యా ప్రభుత్వ సెక్రటరీ యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తెలిపారు.

ఇన్​టైంలో పూర్తి చేయాలి

ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, బారుగూడెంలలో మంత్రి పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.1.76 కోట్లతో చేపట్టిన అరెంపుల సబ్ స్టేషన్ నుంచి ముత్తగూడెం, శ్రీనగర్ కాలనీ రోడ్డు వయా నల్లచెరువు బీటీరోడ్డు, బారుగూడెంలో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, బారుగూడెం నుంచి పోన్నెకల్ - ఆరెంపుల రోడ్డు వరకు రూ.72 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు.