- హాస్పిటల్స్, స్కూళ్లు, హాస్టళ్లను కలెక్టర్లు తనిఖీ చేయాలె
- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశామని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్‍లో నిధుల కోసం కృషి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, కొండా సురేఖతో కలిసి శనివారం హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‍రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వేసిన శిలాఫలకాలు, చేపట్టిన పనులు, అసంపూర్తిగా ఆపేసిన పనులపై చర్చించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పేరుతో ఎమ్మెల్యేలు ఓట్ల రాజకీయం చేశారని, పూర్తయిన ఇండ్లను కూడా పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయడమే కాకుండా, కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.
వేసవిలో తాగు, సాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్, స్కూళ్లు, హాస్టళ్లను కలెక్టర్లు తనిఖీ చేయాలని, తాను కూడా ఆకస్మికంగా తనిఖీకి వస్తానని చెప్పారు. మేడారం పనుల పరిశీలనకు ఈ నెల 30న రానున్నట్లు చెప్పారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్ చేయాలని, వరంగల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, పండ్లు, కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పెండింగ్‍లో ఉన్న భూసేకరణ డబ్బులు మంజూరు చేయడంతో పాటు, జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. రివ్యూలో ప్రభుత్వ విప్ మచంద్రునాయక్, ఎమ్మెల్యేలు మామిడాల యశస్విని, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, వరంగల్ సీపీ అంబర్ కిశోర్‌ఝా, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, శివలింగయ్య, ఇలా త్రిపాఠి, భవేశ్‍మిశ్రా, అద్వైత్‌కుమార్, గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీలు శబరీష్, సంగ్రామ్‌సింగ్ పాటిల్, కిరణ్ కారే పాల్గొన్నారు.
అంతకుముందు హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రులు పరిశీలించారు. పదేండ్లుగా పనులు పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం వరంగల్లోని రాంకీ బిల్డర్స్ హౌసింగ్ బోర్డుకు కేటాయించిన ప్లాట్లను మంత్రి పొంగులేటి పరిశీలించారు. 102 ప్లాట్లను త్వరలో వేలం వేయనున్నట్లు చెప్పారు.
సమస్యలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు
ఉమ్మడి జిల్లా రివ్యూలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. భారీ వర్షాలు పడే టైంలో వరంగల్‌లోని కాలనీలు నీట మునుగుతున్నాయని, సమస్య పరిష్కారం కోసం నాలాలను విస్తరించడంతో పాటు రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని, స్మార్ట్ సిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని, గ్రేటర్‌లో ఉన్న 13 డివిజన్లు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతుల నుంచి అవసరమైన మేరకే భూములు తీసుకోవాలని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ పాకాల చెరువుకు తూములు, కెనాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘన స్వాగతం
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ జనగామలో జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. వారికి కొమ్మూరితో పాటు కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, డీసీపీ సీతారాం స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కో ఆర్డినేషన్‌తో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఉన్నారు. అలాగే చిల్పూరు మండలం కరుణాపురం స్టేజీ వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో మంత్రులకు స్వాగతం పలికి, బోకే, శాలువాలతో సన్మానించారు. అనంతరం కరుణాపురం స్టేజీ వద్ద కాకతీయ కళాతోరణం, జంక్షన్ మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు.