
- ధనిక రాష్ట్రమంటే లంకెబిందెలు ఉన్నాయనుకున్నాం
- బిందెల్లో నిధులు కావు కదా.. నీళ్లు కూడా లేవు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పెనుబల్లి/కల్లూరు, వెలుగు: ‘తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్‌ఎస్ చెబుతుంటే లంకె బిందెలలో నిధులు ఉన్నాయని అనుకున్నాం.. కానీ ఆ బిందెల్లో నీళ్లు కూడా లేవు, బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని కొల్లగొట్టి అప్పులపాలు చేసింది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కలెక్టర్ ముజమ్మీల్‌ఖాన్‌తో కలిసి గురువారం ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన రూ. 8.19 లక్షల కోట్ల అప్పుకు ప్రతి ఏడాది రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. ఓ వైపు వడ్డీలు కడుతూనే మరో వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిమ్మ ఇండ్లు కడుతామని చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చామని, ఈ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఇస్తామని, ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపే సీతారామ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, కల్లూరు ఆర్డీవో రాజేంద్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, తహసీల్దార్లు ప్రతాప్, సాంబశివుడు, ఎంపీడీవోలు అన్నపూర్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.