ఖమ్మం: ఏడేడు లోకాల అవతల ఉన్నా.. తప్పు చేస్తే ఏ దొరనూ వదిలి పెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఒక్కొటి బయట పెడితే ఆ పార్టీ నాయకులు వెళ్లి అంతరిక్షంలో దాక్కుంటారేమో అనిపిస్తుందని ఆయన సెటైర్ వేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరిలో మంత్రి పొంగులేటి సోమవారం (నవంబర్ 11) పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దొర పోకడలు గత పదేళ్లు చూశానని.. ఆయన చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోపెట్టుకొని మాట్లాడేవారని విమర్శించారు. కార్యకర్తలు జారిపోకుండా ఉండేందుకే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నాడని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేదోడిని కూలగొట్టదని.. కేసీఆర్ తొత్తులు అక్రమంగా కట్టడాలు కడితే వాటిని పేదలకు ఇవ్వడం కోసం కూల్చుతున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐలపై విమర్శలు చేసే కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావని.. కేంద్ర పట్టణ శాఖ మంత్రితో నీకు పని ఏందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో నిర్వహించిన ఫార్మూలా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వం అవకతవకలు గుర్తించి కేసు ఏసీబీకి అప్పగించిందని తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో అతడిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే ఏసీబీ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసి 13 రోజులు అయ్యిందని వెల్లడించారు.
ALSO READ | ఆ విషయం నాకు తెలియదు: ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
కేటీఆర్ కేంద్రంలో ఉన్న అర్బన్ మినిస్టర్‌తో పాటు అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడని.. ఈ మేరకు తమకు సమాచారం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు రోజుల్లో ఏ బాంబు పేలబోతుందో తెలిసి కేటీఆర్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లాడన్నారు.
ఈ కార్ రేసింగ్ పేరుతో విదేశాలకు రూ.55 కోట్లు ఎందుకు పంపాడో కేటీఆర్ బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఏ తప్పు చేయనప్పుడు పొలిటికల్ బాంబులు పేలుతాయంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఎంవోయూ సంతకం పెట్టక ముందే విదేశీ కంపెనీకి డబ్బులు పంపాడు.. కేబినెట్ అప్రూవల్ తీసుకోక ముందే కేటీఆర్ సంతకం చేశాడని తెలిపారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో విదేశానికి డబ్బు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి.. మరీ కేటీఆర్ ఎవరి పర్మిషన్ తీసుకొని డబ్బు విదేశాలకు పంపారని ప్రశ్నించారు.
రేపో మాపో అరెస్ట్ అవుతాడని తెలిసే.. అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వడ్డీల భారం ఎక్కువ అయిందని.. అయినప్పటికీ హామీలు నేరవేరుస్తున్నామన్నారు. రూ.13 వేల కోట్ల రుణ మాఫీ డిసెంబర్ వరకు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఇండ్ల కల నెరవేరలేదని.. మా ప్రభుత్వంలో రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లు కట్టబోతున్నామని తెలిపారు.