- కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాతీర్పును ఆయన గౌరవించడం లేదన్నారు. శుక్రవారం మీడియాతో మంత్రి చిట్‌చాట్ చేశారు. 13 నెలల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. కేసీఆర్ జీవితమంతా ఫామ్‌హౌస్ లోనే గడిచిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రజలు వాస్తవాలు గ్రహించి కేసీఆర్ గడీల పాలన వద్దనుకున్నారని, అందుకే కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఛీత్కరించారని తెలిపారు. పథకాలు అమలు కావడం లేదని ఫామ్‌హౌస్‌లో కూర్చొని మాట్లాడటం కాదని, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని ఆయన సూచించారు. ‘‘ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి.
ప్రజలు ఏదో నమ్మి కాంగ్రెస్ కు ఓటేశారని అంటున్నాడు. ప్రజలు వాస్తవాలు గ్రహించారు. అందుకే, కేసీఆర్ గడీల పాలన వద్దనుకుని ఆయనను, ఆయన కుటుంబాన్ని ఛీత్కరించారు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన కేసీఆర్.. భూ భారతి చట్టం ప్రవేశపెట్టిన నాడైనా అస్సెంబ్లీకి వస్తారని ఆశించాం. కానీ, ఆయన రాలేదు” అని పొంగులేటి వ్యాఖ్యానించారు.