
- భూభారతి’ దేశానికి రోల్ మాడల్
- ఆగస్టు 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
- ఆరు వేల మంది ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ
- గత ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది
- అభివృద్ధి, పథకాల అమలు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు
- లింగంపేట మండలం శెట్పల్లిలో రెవెన్యూ సదస్సు
కామారెడ్డి, లింగంపేట, వెలుగు : ‘భూభారతి’ దేశానికే రోల్ మాడల్.. రాష్ట్రంలోని 4 పైలట్ మండలాల్లో జూన్2 లోగా భూ సమస్యలు పరిష్కరిస్తం..’ అని రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం లింగంపేట మండలం శెట్పల్లిలో నిర్వహించిన ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. 15 రోజుల్లో 10,956 రెవెన్యూ గ్రామాల్లో గ్రామాధికారులను నియమిస్తామన్నారు. భూ సర్వేలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పక్షాన ఉన్న 360 మంది సర్వేయర్లతో పాటు ప్రైవేటుగా 6 వేల మందికి శిక్షణ ఇచ్చి, లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమిస్తున్నామన్నారు.
తరతరాలుగా భూ హక్కు పత్రాలు లేని పేద రైతులకు ‘భూభారతి’తో పట్టా పాస్‌పుస్తకాలు అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైనా నాలుగు మండలాల్లో లింగంపేట ఉండడం మండల ప్రజల అదృష్టమన్నారు. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటి వరకు 20 గ్రామాల్లో 3400 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ భూముల మధ్య సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే నాలుగు టీంలను ఏర్పాటు చేశామన్నారు.
‘భూభారతి’లో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వద్ద భూ సమస్య లు పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక్కాగా పైలట్ గ్రామాల్లో అమలు చేస్తున్నామని, మే 5 వరకల్లా తొలి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు మంజూరు చేస్తామన్నారు. రాబోయే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాల అమలును చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంది..
కోట్లు సంపాందించుకునేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్మోహన్రావు విమర్శించారు. సాఫ్ట్‌వేర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకుతిన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుకబడిన లింగంపేట మండలానికి రెవెన్యూ మంత్రి రావడం ప్రధమమని, భూ సమస్యలు ఎక్కువగా ఉన్న లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్‌నాయక్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, లైబ్రరీ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దారులు, రైతులు పాల్గొన్నారు.
‘ధరణి’తో జమిందారులకే లాభం
బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ జమిందారులకే లాభం చేకూర్చిందనిజహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ‘ఉదాహరణకు... నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేటలో రాణి శంకరమ్మ జమీందార్ ఉండేవారు. వీరికి 20 గ్రామాల్లో 500 ఎకరాలకు పైగా భూములు ఉండేవి. చిన్న సన్న కారు రైతులు సాగు చేసుకునే వాళ్లు. వాళ్లకు చట్టం ప్రకారం అప్పటి కాంగ్రెస్ సర్కారు పట్టాలు ఇచ్చింది. ధరణి వచ్చాక ఆ భూములన్ని రాణి శంకరమ్మ పేరిట రికార్డుల్లో వచ్చాయి.. దీంతో ఆమె వారసులు వచ్చి రైతుల వద్ద మళ్లీ పైసలు వసూలు చేశారు..’ అని చెప్పారు.