ధాన్యంలో తరుగు తీస్తే చర్యలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ధాన్యంలో తరుగు తీస్తే చర్యలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి, వెలుగు :  ధాన్యంలో తరుగు తీస్తే చర్యలు తప్పవని రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిల్లర్లను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కట్టుకాసారం, పైనంపల్లి, బోదులబండ, కోనాయిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు  ధర పొందాలని సూచించారు.  రైతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేసినా, మిల్లర్లు ధాన్యం కటింగ్ పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 రైతును రాజును చేయాలని ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. రూ. 20,600 కోట్లతో 25.65లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. గతంలో కేసీఆర్​ వరి వేస్తే ఊరే అని రైతులను భయపెట్టాడని, కానీ ఇందిరమ్మ ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధర తో పాటు రూ.500 బోనస్ ఇస్తోందని గుర్తు చేశారు.  ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకతీతంగా కట్టించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్ కుమార్, కుక్కల హనుమంతరావు, జానకిరామయ్య, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు బొడ్డు బొందయ్య పాల్గొన్నారు. 

చేపల వలలు పంపిణీ

ఖమ్మం రూరల్​ : శిక్షణ పొందిన 50మంది గిరిజన మత్స్యరైతులకు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ లో మంత్రి పొంగులేటి ప్రశంసాపత్రం, రూ.8,500 విలువ చేసే చేపల వల కిట్టును అందజేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ వారి ఆర్థిక సాయంతో ఖమ్మం జిల్లా గిరిజనన మత్స్యకారుల అభివృద్ధి కోసం ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి.. యాజమాన్యపద్ధతులపై మూడురోజుల పాటుశిక్షణ పూర్తి అయిన తరువాత వీరికి ఈ కిట్టులను అందించారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. దివ్యాంగులకు టీజీవోబీఎంఎంఎస్​  ద్వారా 100 శాతం సబ్సిడీతో టీవీఎస్​ స్కూటీలను మంత్రి ఎనిమిది మంది లబ్ధిదారులకు పింపిణీ చేశారు. వీటి విలువ రూ.9.40లక్షలు ఉంటుందని మంత్రి తెలిపారు.