
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిఉందని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏఎంసీ కాలనీలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 117 ఇండ్లను ఇటీవల పూర్తి చేసి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందించిన ఇండ్లలో అన్ని వసతులు కల్పించామన్నారు. 2004 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా ఇండ్లను వదిలేయడంతో వాటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు.
రూ.1.40కోట్లతో మనుబోతుల చెరువు వద్ద నిర్మించిన డంపింగ్ యార్డును భద్రాచలం ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియాన్ని ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి సందర్శించారు. ప్రపంచానికి గిరిజన సంస్కృతిని పరిచయం చేసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు బహుమతులు అందజేశారు. మంత్రి వెంట కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, డీఆర్డీఓ విద్యాచందన, డీడీ మణెమ్మ ఉన్నారు.
మాడవీధుల స్థల సేకరణ పూర్తి చేస్తాం
భద్రాచలం రామాలయంలో మాడవీధుల అభివృద్ధికి స్థల సేకరణను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, శ్రీరామనవమి నాడు సీఎం రేవంత్‌రెడ్డి చేత పనులకు భూమి పూజను చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించి ఆర్డీవో ఆఫీసులో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శ్రీరామనవమికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
భద్రాద్రికొత్తగూడెం : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం చుంచుపల్లి మండలంలోని టాటా జుడియో షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు
ప్రెస్‌క్లబ్ కోసం ల్యాండ్ కేటాయిస్తాం
కొత్తగూడెంలో మంత్రి టీయూడబ్ల్యుజే(ఐజేయూ) ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు మంత్రిని ఆదివారం కలిశారు. ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. కొత్తగూడెంలో జిల్లా స్థాయిలో నిర్మించే ప్రెస్ క్లబ్ కోసం ల్యాండ్ కేటాయించాలని విజ్ఞప్లి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం అవసరమైన ల్యాండ్‌ను చూడాలని కలెక్టర్‌కు సూచించారు.
అభివృద్ధి త్వరగా పూర్తి చేయాలి
ఖమ్మం రూరల్/కూసుమంచి : ఆదివారం ఏదులాపురం మున్సిపల్ పరిధిలో మంత్రి పొంగులేటి పర్యటించారు. రూ.2 కోట్ల 85 లక్షలతో గుర్రాలపాడు నుంచి కొత్త నారాయణపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం, రూ. 2 కోట్ల 4 లక్షలతో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుంచి ఖమ్మం గుదిమళ్ల జడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు, రూ.కోటి 95 లక్షలతో గుదిమళ్ల నుంచి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏదులాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్పీడప్ చేయాలన్నారు. వర్షాకాలం లోపు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి గుదిమళ్లలోని తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కూసుమంచి మండలంపాలేరు గ్రామంలో ఇటీవలఎడవల్లి రాంరెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ మృతి చెందడంతో మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.