- గత ప్రభుత్వం యూసీలు ఇవ్వకనే ఉన్న నిధులూ వాడుకోలేని పరిస్థితి
- వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం కోరాం
- రెండు రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి
- ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటన
కూసుమంచి/నేలకొండపల్లి, వెలుగు: విపత్తు నిధులను గత బీఆర్ఎస్సర్కారు దారి మళ్లించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత నాలుగేండ్లలో కేంద్రం నుంచి విపత్తుల కోసం వచ్చిన రూ.1358 కోట్లకు పైగా నిధులు పేపరు మీద మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘విపత్తు నిధులను గత సర్కారు వేరే సెక్టార్లకు మళ్లించింది. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడితే.. అందుకు సంబంధిచిన యుటిలైజేషన్సర్టిఫికెట్ (యూసీ)ను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఈ యూసీ ని కేంద్రానికి పంపించనంతవరకూ ఆ డబ్బులు రాష్ట్ర బ్యాంకు ఖాతాలో ఉన్నాయని అనుకోవడం సర్వసాధారణం. పేరుకే విపత్తు నిధులున్నాయని కానీ.. ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి ఉన్నది” అని వెల్లడించారు. అసలు గత ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు చూపలేకపోయిందా? లేక వేరే వాటికి మళ్లించిందా? అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. శనివారం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించారు.
కట్టుకాచారంలో విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఆదివారం సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.10,300 -కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్టు చెప్పారు. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని కోరామని, వరద నష్టాన్ని వివరించేందుకు సమయం ఇవ్వాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం రేవంత్విజ్ఞప్తి చేశారని తెలిపారు. నాలుగైదు రోజుల్లో సీఎం, తాను, అధికారుల బృందం ప్రధాని, హోంమంత్రిని కలిసి విపత్తు సాయం కోరుతామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాకపోయినా వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరద తీవ్రతతో దెబ్బతిన్న ఇండ్లు, గుడిసెలకు పరిహారం కింద 16,500, 18 వేల చొప్పున చెల్లించినట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.10వేల చొప్పున అకౌంట్లో వేస్తామని ప్రకటించారు. మంత్రి వెంట జిల్లా నాయకుడు నెల్లూరి భద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేశ్, కుక్కల హనుమంతరావు, మామిడి వెంకన్న, రాయపూడి నవీన్, బొందయ్య, తదితరులున్నారు.