అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి, వెలుగు : అర్హులైన చివరి లబ్ధిదారు వరకు సంక్షేమ పథకాలను అందిస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బుధవారం మంత్రి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నేలకొండపల్లి మండలం మోటాపురంలో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్, పైనంపల్లి, అప్పల నరసింహాపురం, కట్టుకాచారంలలో రోడ్లను ప్రారంభించారు. కోరట్లగూడెం, కోనాయిగూడెం, కొంగర, బుద్దారంలో సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి ప్రభుత్వం అమలు చేసే నాలుగు కొత్త స్కీమ్‌‌లకు సంబంధించి గ్రామసభలు జరుగుతున్నాయని, లిస్ట్‌‌లో పేర్లు లేని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు, దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఎవరి మాటలు నమ్మొద్దని సూచించారు. పేద ప్రజలందరికీ పథకాలు అందుతాయని, ఎవరైనా అప్లై చేసుకోకపోతే గ్రామ సభలు, ప్రజా పాలన కేంద్రాల్లో అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు. 

రేషన్‌‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఇందిరమ్మ ఇండ్లు మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఇస్తున్నామని, తర్వాతి దశలో భూమి లేని అర్హులకు కేటాయిస్తామన్నారు. నాలుగు పథకాలకు సంబంధించి ఆఫీసర్లు చదివిన లిస్ట్‌‌లో ఎవరైనా అనర్హులు ఉంటే రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని, విచారించి వారి పేర్లను తొలగిస్తామన్నారు. ఏడాది కాలంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ ఎం.విజయబాబు, ఆర్‌‌అండ్‌‌బీ ఎస్‌‌ఈ హేమలత, ఇరిగేషన్‌‌ ఎస్‌‌ఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.