భూ సమస్యల పరిష్కారానికి కృషి :  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • రాష్ట్రంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా మోడల్​ గా ఉండాలి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని,  ఇందులో భద్రాద్రికొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే మోడల్​ ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్​లో కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్​తో కలిసి పలు శాఖల ఆఫీసర్లతో భూ సమస్యలపై శనివారం రివ్యూ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన భూ మ్యాప్​లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఒకే సర్వే నెంబర్​లో ఫారెస్ట్​, పట్టా, గవర్నమెంట్​ భూములున్నాయన్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భూ భారతి చట్టంతో ఆ భూస్వాముల రైతలకు న్యాయం చేస్తామన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక పెద్ద సర్వే నెంబర్​ను మోడల్​గా తీసుకొని సర్వే చేయనున్నట్టు తెలిపారు. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలున్న ప్రాంతాల్లోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.

భూ సర్వేకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపా, మార్క్​ ఫెడ్​ డైరెక్టర్​ కొత్వాల శ్రీనివాసరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్వే ల్యాండ్​ అండ్​ రికార్డ్స్​ ఏడీ శ్రీనివాసులు, ఆర్డీవో మధు పాల్గొన్నారు.

సింగరేణి ఆఫీసర్లపై ఆగ్రహం పాల్వంచలో పర్యటన, కలెక్టరేట్​లో ఆఫీసర్లతో రివ్యూ అనంతరం మంత్రి రెస్ట్​ తీసుకునేందుకు ఇల్లెందు క్రాస్​ రోడ్డులోని సింగరేణి గెస్ట్​ హౌస్​కు వెళ్లగా అక్కడ గదులు శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా  కల్లూరు మండలం నారాయణపురంలోని తన నివాసానికి ఆదివారం సింగరేణి గెస్ట్​ హౌస్​ ఆఫీస్​ నిర్వహణ ఆఫీసర్లు, సిబ్బంది రికార్డులతో రావాలని ఆదేశించారు.