వరంగల్ పట్టణాన్ని తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు, సంబంధిత శాఖల ఆఫీసర్లతో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని విస్తృత పరచడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టాడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు గతంలో సమావేశాలు నిర్వహించామని మంత్రి తెలిపారు.
గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, రోడ్లు భవనాలు శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, కుడా వైస్ చైర్మన్, కమీషనర్ అశ్విని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, కన్సల్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు.