పేలబోయేవి లక్ష్మీబాంబులు కాదు.. ఆటంబాంబులు.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి కౌంటర్

పేలబోయేవి లక్ష్మీబాంబులు కాదు.. ఆటంబాంబులు.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి కౌంటర్
  • అంత ఉలికిపాటెందుకు..?
  • కేటీఆర్​.. లొంగిపో
  • గుమ్మడికాయల దొంగ అంటే భుజాలెందుకు
  • తడుముకుంటున్నవ్: మంత్రి పొంగులేటి
  • పేలబోయేవి లక్ష్మీబాంబులు కాదు.. ఆటంబాంబులు
  • ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లకుచట్ట ప్రకారం శిక్ష తప్పదు 
  • పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా కేటీఆర్​ను ప్రజలు నమ్మరని వ్యాఖ్య

మహబూబాబాద్/వర్ధన్నపేట, వెలుగు: అవినీతి కేసుల్లో గుమ్మడికాయల దొంగలు అనగానే కేసీఆర్​కుటుంబం భుజాలు తడుముకుంటున్నదని, తప్పులు చేశారు కాబట్టే కేటీఆర్​ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని, దానికంటే ఆ కుటుంబం మొత్తం పోలీసులకు లొంగిపోవడం ఉత్తమమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కేటీఆర్​తప్పు చేయనప్పుడు ఎందుకు అంత ఉలిక్కి పడ్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘రాజకీయ బాంబులు పేల్తాయని నేను అంటే.. అవి తుస్సు బాంబులని కేటీఆర్ చెప్తున్నడు. ఆయనకు అంత ఉలికిపాటెందుకు? అవి నాటు బాంబులో.. లక్ష్మీబాంబులో కాదు.. తప్పు చేసినవాళ్లకు అవి ఆటంబాంబులు” అని తెలిపారు.

ప్రజల సొమ్ములను కాజేసి విదేశాలకు తరలించిన బీఆర్ఎస్​నేతలకు చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ‘‘ఆయన సంతకాలు పెట్టిన, చట్టం ఇదీ అని చెప్తున్నడు. ఏ మంత్రికి ఏ శాఖకు ఏ పవర్స్​ ఉంటయో తెలియనంత అమాయకులు ఇక్కడ లేరు. పేదల సొమ్ము రూ. 55 కోట్లను ఎవరి ద్వారా ఎవరికి చేరవేశారో తప్పకుండా తేలుస్తం” అని కేటీఆర్‎ను హెచ్చరించారు.  గురువారం మహబూబాబాద్​జిల్లా తొర్రూరులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు.

తప్పులు చేయకపోతే కేటీఆర్​ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము కాజేసినవాళ్లు ఎంతటి వాళ్లయినా ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.  జైల్లో పెడ్తే యోగా, జిమ్ము చేసి ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని కేటీఆర్​అంటున్నారని.. ఆయన పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. అయితే కేటీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.  

ధరణి పేరు చెప్పి భూములు స్వాహా చేశారు

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన పదకొండు రోజుల నుంచే ప్రభుత్వాన్ని దించాలని బీఆర్​ఎస్​ నేతలు కుట్రలు మొదలు పెట్టారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఈ ప్రజా ప్రభుత్వంపై కేటీఆర్​ , హరీశ్​ రావు విషం కక్కడం మానుకోవాలని ఆయన అన్నారు. ‘‘రాజకీయంగా నమ్ముకున్న వ్యక్తులను తడిగుడ్డతో గొంతుకోసే నీచమైన చరిత్ర కేసీఆర్​ కుటుంబానిది. చాటుగా అదానీ  కాళ్లు పట్టుకోవాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఎవరి కాళ్లు పట్టుకోలేదు. 

ఒక్కసారి అది కూడా ఖమ్మంలో అప్పట్లో బీఆర్ఎస్​లో చేరినప్పుడు సభావేదిక వద్దే తండ్రిలా భావించి కేసీఆర్​ కాళ్లు మొక్కాను. కానీ, నాతోపాటు నా అనుచరులను తడిగుడ్డతో గొంతుకోయాలని చూశారు. అందుకే బీఆర్​ఎస్​కు ఖమ్మం ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పారు’’ అని పొంగులేటి తెలిపారు.  ధరణిలో లోపాలను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ హయంలో హైదరాబాద్​ పరిసర ప్రాంతాలు, ఇతరచోట్ల కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్​నాయకులు స్వాహా చేశారని, వాటిలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఇప్పటికే వెనక్కి తెస్తున్నామన్నారు.

 ధరణి సాఫ్ట్​వేర్​ బాధ్యతలను గత ప్రభుత్వం విదేశీ కంపెనీలకు అప్పగిస్తే  తాము అధికారంలోకి రాగానే  ప్రభుత్వ ఆధీనంలోని ఎన్​ఐసీకి అప్పగించామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కొత్త ఆర్వోఆర్​చట్టంలో పలు నిబంధనలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, మరో రూ.13వేల కోట్లను   త్వరలోనే అందిస్తామన్నారు.  రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి స్మార్ట్​కార్డు అందిస్తామని, ఈ కార్డు ద్వారా రేషన్​, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, పింఛన్​,ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​, 500లకు గ్యాస్​ సిలిండర్​ పథకాలను పొందొచ్చని వివరించారు. రాబోయే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు.