
హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న పదేళ్లు 400 ఎకరాల అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించిన మంత్రి.. చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్లకు చెందిన సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూముల అంశం వివాదస్పదంగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 1) మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ మీటింగ్లో గచ్చిబౌలి భూముల వివాదం గురించి చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే.. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలోనే ప్రభుత్వం, వర్శిటీ మధ్య భూ మార్పిడి ఒప్పందం జరిగిందని వివరణ ఇచ్చారు. 400 ఎకరాల ల్యాండ్ కేసు మేం కోర్టులో గెలిచామని.. దీనిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.
భూములు చదును చేస్తుంటే పర్యావరణానికి ప్రమాదమని దుష్ప్రచారం చేస్తున్నారు.. మూగ జీవాలు చనిపోయాయని సోషల్ మీడియాలో పాత ఫొటోలు సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ కుట్ర వెనక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల ముసుగులో అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క జంతువు అయిన చనిపోయినట్లు రుజువు చేయండని సవాల్ విసిరారు. పర్యావరణానికి, మూగ జీవాలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమి చదును పనులు చేస్తున్నామని పేర్కొన్నారు.
ALSO READ : HCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క
ప్రతిపక్షాలది గుడ్డకాల్చి మీద వేసే ప్రయత్నం తప్ప.. మరొకటి కాదని విమర్శించారు. అసలు హెచ్సీయూ భూములకు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని.. మేం ఇప్పుడు వర్శిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగిలినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సెంట్రల్ యూనివర్శిటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధం మరోసారి రుజువైందని విమర్శించారు.