
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ స్కీమ్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు 2025, మార్చ్ 31 వరకు ఉందని.. ఆలోపు చేసుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికైతే ఎల్ఆర్ఎస్ గడువు పొడగించే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇప్పుడు కాకుండా ఇళ్ళు కట్టేటప్పుడు కావాలంటే అప్పుడు 100 శాతం ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్కు ఆశించిన మేర స్పందన ఉందని తెలిపారు.
సోమవారం (మార్చి 24) మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో భూ వ్యాల్యూ పెంచబోతున్నామని తెలిపారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ను నియమిస్తామని.. అలాగే లైసెన్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్లు ఉన్నారని వీరికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశం కల్పిస్తామన్నారు.
సాదాబైనామాల కొత్త దరఖాస్తుల స్వీకరించం:
సాదా బైనామాలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తు లను స్వీకరించమని తేల్చి చెప్పారు.
పాత దరఖాస్తు లలో 13 లక్షల అప్లికేషన్లను గత ప్రభుత్వం రిజక్ట్ చేసిందని.. దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు అప్పిలేట్ ఆథారిటిలో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రం ప్రధాని అవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్ష 13 వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుందని.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. రూరల్ ఏరియాకు సంబందించి కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో ఏ సమస్య లేదు:
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో విభేదాలు ఉన్నట్లు జరుగుతోన్న ప్రచారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. నాకు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మధ్య ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అనిరుధ్ రెడ్డితోనే కాకుండా ఇతర ఏ ఎమ్మెల్యేతో నాకు విభేదాలు లేవని వివరణ ఇచ్చారు. నేను ఏ వ్యక్తి పట్ల భేదం చూపించకుండా జన్యున్ పని చేశానని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెల్వదని క్లారిటీ ఇచ్చారు.