- ప్రధాన నాయకులపై చర్యలు..అన్ని ఆధారాలతో ఫైళ్లు రెడీ
- ధరణి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో యాక్షన్ ఉండొచ్చు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి : రెండు రోజుల్లో రాజకీయ సంచలనాలు సృష్టించే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి 8 నుంచి 10 అంశాల్లో కొందరు ప్రధాన నాయకులపై చర్చలు ఉండొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలతో ఫైల్స్ రెడీ అయ్యాయని చెప్పారు. ‘‘ధరణికి సంబంధించింది కానీ..కాళేశ్వరానికి సంబంధించింది కానీ ఫోన్ ట్యాపింగ్ ఇతరత్రా ఏదైనా కావొచ్చు..ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒక అంశంలో బాంబులు పేలుతాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు” అని పేర్కొన్నారు.
సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అక్కడ మీడియాతో మాట్లాడారు. సియోల్ నుంచి మరో 2 రోజుల్లో తాము హైదరాబాద్ వచ్చేసరికి ఈ చర్యలు ప్రారంభ మయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ‘‘గత సర్కార్ ధరణిని ప్రైవేట్ విదేశీ కంపెనీకి అప్పగించింది.. దాని వెనక ఎవరున్నారు? ఎవరికి ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయనే దానిపై ట్రేస్ చేస్తున్నం. తప్పు చేసినోళ్లు ఎంత పెద్ద వాళ్లయినా వదిలి పెట్టబోం. ఇది కక్షసాధింపు కాదు. పూర్తిగా ఆధారాలతో చర్యలు ఉంటాయి” అని తెలిపారు. ఆధారాలు లేకుండా తొందర పడి ముందుకు వెళ్లబోమని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ దాదాపు పూర్తయిందని.. ఫోన్ ట్యాపింగ్, ధరణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వంలోని అక్రమాలపై ప్రజలు ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని భావించొద్దని, వారు కోరుకునే విధంగా చర్యలు ఉంటాయన్నారు. పూర్తి ఆధారాలతో ఫైళ్లు కదిలాయని.. రెండు రోజుల్లోనే చర్యలకు సంబధించి ప్రజలు వార్తలు తెలుసుకుంటారని ఆయన తెలిపారు.