విద్యాసంస్థలకు సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ

విద్యాసంస్థలకు సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
  • ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకే సెలవు
  • మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం
  • జీహెచ్ఎంసీ పరిధిలో కూడా: పొంగులేటి
  • పాలేరు ఘటనపై మంత్రి భావోద్వేగం 
  • ఖమ్మంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధితో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మిగతా జిల్లాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎస్​శాంతికుమారి, డీజీపీ జితేందర్ తో పాటు కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. 

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ముందస్తు చర్యలు చేపట్టడంతోనే చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అడ్డుకోగలిగామని ఆయన తెలిపారు. 

పునరావాస కేంద్రాల్లోకి 3వేల మంది.. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిల్లోకి 3వేల మందికి పైగా తరలించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాత ఇండ్లు, గోడలు కూలే ప్రమాదం ఉండడంతో ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో 26 ప్లాటూన్ల రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ‘‘నా నియోజకవర్గం పాలేరులో వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. 

హెలికాప్టర్లను సిద్ధం చేసినా వాతావరణం అనుకూలించక అవి అక్కడికి వెళ్లలేకపోయాయి. ఇంటి పైకి ఎక్కిన ఆ కుటుంబంలోని ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారు. వారిని ఒకరిని రక్షించాం. మరో ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గోదావరి, కృష్ణా నదులతో పాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి.. పకడ్బందీగా నీటిని వదలడంతో చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. 

అయినప్పటికీ  చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశాం” అని తెలిపారు.