ఖమ్మం రూరల్/కూసుమంచి/నేలకొండపల్లి, వెలుగు : ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అన్ని గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, తిరుమలాయపాలెం మండల కేంద్రం, కూసుమంచి మండలం ముత్యాలగూడెం, నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన సభల్లో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు వెంటనే ప్రారంభించిందని తెలిపారు. మిగతా అన్ని కార్యక్రమాలు విడతల వారీగా చేసుకుందామని చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ అధికారులే ఇంటికి అప్లికేషన్ పంపించారన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాపాలక కార్యక్రమాల్లో జిల్లాలో 1.24లక్షల అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. దీంతోనే గడిచిన పది సంవత్సరాల్లో ప్రజల కలలు కలలుగానే మిగిలాయని తెలిసిపోతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆ కలలు నిజం కాబోతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న పేదలను విస్మరించి అవసరం లేని బంగ్లాలను తన గొప్ప కోసం కేసీఆర్ నిర్మించారని ఆరోపించారు. రాబోయే కొద్దీ రోజుల్లోనే విధివిధానాలు రూపొందించి ప్రజల గుమ్మం ముందుకే పాలన తీసుకొచ్చి పథకాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ సత్య ప్రసాద్, డీఆర్డీవో విద్యాచందన, ఎంపీడీవో, తహసీల్దార్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.