నేలకొండపల్లి, వెలుగు : తనపై నమ్మకంతో తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం పని చేస్తా.. పాలేరువాసులను మెప్పిస్తానని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ‘ప్రజల చెంతకే మీ శీనన్న’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో తనను గెలిపించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు.
పేదోళ్లకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. విద్య, వైద్యం కోసం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో విడతలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, నాయకులు శాఖమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, రాయపూడి నవీన్, హనుమంతరావు, మామిడి వెంకన్న, షేక్ ఖాజామియా, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.