బీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటేనని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టపగలు తిట్టుకోవడం రాత్రిపూట బుజ్జగించుకోవడం వారికే అలవాటేనన్నారు. ఈ రెండు పార్టీలను ఏడడుగుల లోతు గొయ్యి తీసి పాతిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలోనే కాదు దేశంలో ఒక్క సీటు కూడా రాని కేసీఆర్ నామా నాగేశ్వరావుని ఎలా కేంద్ర మంత్రిని చేస్తారో చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి. బీజేపీతో పొత్తు ఉందని కేసిఆర్ చెప్పకనే చెబుతున్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని కేసీఆర్ ఎందుకు నిలదీయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీజేపని ప్రశ్నిస్తే జైల్లో పెడతారని కేసీఆర్ కు తెలుసునన్నారు.
తెలంగాణలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం ఇబ్బంది పడొద్దన్నారు మంత్రి పొంగులేటి. తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీళ్ల ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మూడు రూపాయలు ఉన్న యూనిట్ ని 20 రూపాయిలతో కొన్నారని.. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితేటలతో యూనిట్ మూడు రూపాయల యాభై పైసలకే కరెంటు కొంటుందని చెప్పారు. కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది కేసీఆరేనని మండిపడ్డారు.