- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదని, ఎన్నికల తర్వాత కారు స్క్రాప్ కు వెళ్లడం ఖాయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం లోక్ సభకు కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న రామసహాయం రాఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్యులకు శిక్ష తప్పదన్నారు.
పదేండ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ ఇప్పుడేమో ప్రజల కోసమంటూ రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. హరీశ్‌రావు రాజీనామా అంటూ డ్రామాలాడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 17 సీట్లలో 14 నుంచి 15 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాహూల్ గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు. ఖమ్మం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచే లక్షకు పైగా కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రోగ్రాంలో ఖమ్మం లోక్ సభకు పోటీ చేస్తున్న రామసహాయం రాఘురామిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె, సాబీర్‌పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, టీజేఎస్ స్టేట్ లీడర్ రామనాధం, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కాంగ్రెస్ నేతలు బాలసాని లక్ష్మీనారాయణ, తోట దేవీ ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, తూళ్లూరి బ్రహ్మయ్య, ఆళ్ల మురళి, విజయబాయి, స్వర్ణలత,చీకటి కార్తీక్ పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు
పాల్వంచ, వెలుగు : పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీని వాస రె డ్డి, ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి శనివారం పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు. వారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా సురేశ్‌రెడ్డి పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు.