భద్రాచలం, వెలుగు : ఎవరి సిఫార్సు లేకుండా అర్హులైన గిరిజన లబ్ధిదారులకు మాత్రమే డబుల్‌బెడ్ రూం ఇండ్లను అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థానిక కేకే ఫంక్షన్ హాలులో శనివారం ఆయన ఏఎంసీ కాలనీలోని నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
250 ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు చిన్న చిన్న రిపేర్లు చేయించి గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఏజెన్సీ ఏరియాలోని వివిధ మండలాల్లో ఇదే తరహాలో టెండర్లు పూర్తయి, సగంలో నిలిచిపోయిన ఇండ్లన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి ఈ ఇళ్లను పంపిణీ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి
ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి మంత్రి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆఫీసర్లంతా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు.
భద్రాచలంలో డంపింగ్ యార్డును 15 రోజుల్లో ప్రారంభించాలన్నారు. ఐటీడీఏ ద్వారా చేపట్టే రోడ్లకు ఫారెస్ట్ పర్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు. వేసవి కాలం నాటికి గిరిపల్లెల్లో తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా సర్ధుబాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కోతలు ఉండకూడదన్నారు.
ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ ఏజన్సీ ఏరియాల్లో స్కూళ్లలో టీచర్ల, ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ పెండింగ్ పనులు అన్ని శాఖలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్,అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజ్, ఈఈ తానాజీ, డీడీ మణెమ్మ పాల్గొన్నారు.
రామాలయాభివృద్ధిలో ముందుంటాం
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులం ముగ్గురం భద్రాచలం రామాలయాభివృద్ధిలో ముందుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాడవీధుల్లో పర్యటించి చేపడుతున్న భూసేకరణ, చేయబోయే పనుల గురించి చర్చించారు. అనంతరం ఐటీడీఏలోని హౌసింగ్ గెస్ట్ హౌస్‌లో ఆదివాసీలు తయారు చేసిన పాత వంటకాలతో ఆయనకు విందు ఇచ్చారు. పాతకాలం నాటి ఆదివాసీ వంటలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రశంసించారు.
ఖమ్మం రూరల్ : -ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఆయన చెప్పారు.