7 నెలల్లో మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి కావాల్సిందే : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

7 నెలల్లో మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి కావాల్సిందే : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో దశాబ్దాల నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఏడు నెలల్లోగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిందేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతినెలలో రెండు సార్లు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ ఇతర అంశాలపై శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులతో సమీక్షించారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నది తీరం వెంబడి రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల ఆర్సీసీ రిటైనింగ్ వాల్​ నిర్మిస్తున్నామని తెలిపారు.

 వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై 15వ తేదీలోపు పనులను పూర్తి చేయాలన్నారు. వాల్ నిర్మాణానికి అవసరమైన 170 ఎకరాలు పట్టా భూముల సేకరణ కోసం వెంటనే యజమానులతో మాట్లాడి భూసేకరణ జరపాలని ఆదేశించారు. భూ సేకరణ ఎంజాయ్ మెంట్ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ కు సూచించారు. మున్నేరు బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలు, ఖమ్మం అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలకు సంబంధించి వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు.

 కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గత సెప్టెంబర్ లో 3 లక్షల 12 వేల క్యూసెక్కులకు పైగా మున్నేరు నది వరద వచ్చిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 15 మీటర్ల ఎత్తు , 6 మీటర్ల వెడల్పుతో రూరల్, అర్బన్ ప్రాంతంలో 8.5 కిలోమీటర్ల చొప్పున 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కోసం శాస్త్రీయంగా డిజైన్​ తయారు చేశామని 
వివరించారు. 

కొత్తగూడెంలో పర్యటన 

భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్/పాల్వంచ, వెలుగు : బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో స్టూడెంట్లకు సరిగా తిండి పెట్టలేదని మంత్రి పొంగులేటి అన్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్​ మండలాల్లో ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్రా గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలో క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైఫిల్​ షూటింగ్​ రేంజ్​ను ప్రారంభించారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని కోరిక మేరకు కొత్తగూడెంలో స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

కొత్తగూడానికి ఎయిర్​ పోర్టు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామిరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెంలో అథ్లెటిక్స్​ ట్రాక్​ ఏర్పాటుకు దాదాపు రూ. 8కోట్లు అవసరం అవుతాయని, నిధుల మంజూరుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ ఏర్పాటుకు 18 ఎకరాల స్థలం అవసరం అవుతుందని, అందరితో చర్చించి ఒక ప్రత్యేక స్పోర్ట్స్​ పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సీఎం కప్​ స్టేట్​ లెవెల్​ పోటీల్లో జిల్లాకు పలు బహుమతులు రావడం అభినందనీయమని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​పేర్కొన్నారు. 

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు 

ఖమ్మం రూరల్/ఖమ్మం టౌన్​, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఎం. వెంకటాయపాలెంలో రూ. 66.10 లక్షలతో సీసీ రోడ్డు, ఎంవీ పాలెం నుంచి గోళ్లపాడు వరకు రూ.2 కోట్ల 60 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు, కాచిరాజుగూడెం  నుంచి రూ.18 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు, రూ.2 కోట్ల 75 లక్షలతో చింతపల్లి ఆరెకోడుతండా నుంచి తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 అంతకుముందు కలెక్టరేట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సమీక్షించారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం అర్బన్ మండలంలోని మల్లెమడుగులో 84, కూసుమంచి మండలం దుబ్బ తండాలో 29, నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం లో 18, మొత్తం 131 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని నిరుపేదలకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.