గోదావరి కరకట్టలు పటిష్టంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గోదావరి కరకట్టలు పటిష్టంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, వెలుగు : గోదావరి వరదల నేపథ్యంలో కరకట్టలు పటిష్టంగా ఉండాలని ఇరిగేషన్​ ఇంజినీర్లను రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాచలంలో గురువారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు.  ముందుగా పాత కరకట్టలను ఆయన తనిఖీ చేశారు. విస్తా కాంప్లెక్స్ వద్ద స్లూయిజ్, పంపింగ్​ హౌస్​ను పరిశీలించారు. వరదల సమయంలో ఇక్కడే ప్రధాన సమస్య తలెత్తుతున్న విషయాన్ని ఆయన ఇరిగేషన్​ ఇంజినీర్ల వద్ద ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న గేట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

పాత కరకట్టలపై ఉన్న స్లూయిజ్​లను బలోపేతం చేయాలని, అందుకు అవసరమైన పనులను వరదల తర్వాత వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. తీర ప్రాంతంలోని ప్రజలు వరదల సమయంలో అధైర్యపడకుండా ఆఫీసర్లు సూచించిన విధంగా పునారావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రూ.38కోట్లతో కూనవరం రోడ్డులో అసంపూర్తిగా ఉన్న ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణాలను తనిఖీ చేశారు. జేసీబీ సాయంతో కరకట్ట మధ్య భాగంలో తవ్వించి, లేయర్ల వారీగా పోస్తున్న మట్టి నాణ్యతను పరిశీలించారు.

ఎన్నికలకు ముందు భద్రాచలం ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా కరకట్ట నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఏఎస్పీ పంకజ్​పారితోష్​, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, రాందాస్​ నాయక్, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, ఇరిగేషన్​ సీఈ శ్రీనివాసరావు, ఈఈ రాంప్రసాద్, డీఈ మస్తాన్​రావు, ఏఈ వెంకటేశ్వరరావు ఉన్నారు.

రామచంద్రయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం 

మణుగూరు : పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం మణుగూరులో పర్యటించిన ఆయన ఇటీవల మాతృవియోగం చెందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాములమ్మ ఫొటోకు నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సకిని రామచంద్రయ్య నివాసానికి చేరుకొని ఆయన ఫొటోకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామచంద్రయ్య మృతి గిరిజన తెగకు తీరని లోటన్నారు.

గిరిజన సంప్రదాయంలో కంచు తాళం ద్వారా వారి జానపద కళను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి రామచంద్రయ్య అని కొనియాడారు. ఆయన కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రామచంద్రయ్యకు రూ.కోటి నజరానా, ఇంటి స్థలం ఇస్తానని చెప్పి విస్మరించిందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. సీఎంతో మాట్లాడి దశదిన కర్మల అనంతరం రామచంద్రయ్య కుటుంబానికి జిల్లా కేంద్రంలో 462 గజాల స్థలాన్ని ఇవ్వడంతోపాటు రూ.కోటి నజరానాని అందజేస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.