ఖమ్మం జిల్లాలో మార్కెట్ కోసం భూమి కేటాయిస్తే.. మట్టిని అమ్ముకున్నరు!

  • హైవే పనులు, ప్రైవేట్ వెంచర్లకు లారీల్లో తరలింపు 
  • కాంట్రాక్టు ఒకరు.. పనులు చేయించేది మరొకరు
  • మద్దులపల్లి యార్డు నిర్మాణంలో బీఆర్ఎస్​ నేత భాగోతం 
  • అప్పటి ఎమ్మెల్యే సపోర్టుతో అడ్డగోలుగా పనులు 
  • రికవరీ చేయించాలని మంత్రి పొంగులేటి ఆదేశం 

ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 2022లో ప్రభుత్వం భూమి కేటాయించి శంకుస్థాపన చేస్తే కొందరు అందులో ఉన్న మట్టిని తవ్వి అమ్ముకున్నారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్టుతో బీఆర్ఎస్​ నేత సాగించిన భాగోతం ఇది.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పనులు జరగకుండానే బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలని భావిస్తోంది.

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు :  ఖమ్మం రూరల్​ మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం అగ్రిమెంట్ ప్రకారం శంకుస్థాపన తర్వాత ఏడాదిలోగా మార్కెట్​ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్​మారడంతో ఏడాదిన్నరగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంగళవారం మార్కెట్​ యార్డు నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు.  నాసిరకం పనులపై సీరియస్​ అయ్యారు. మార్కెట్​పనులతో పాటు, మట్టి అక్రమ తవ్వకాలపై పూర్తిగా ఎంక్వైరీ చేయాలని, బిల్లులు ఎక్కువగా చెల్లించి ఉంటే రికవరీ చేయాలని మినిస్టర్​ ఆఫీసర్లను ఆదేశించారు. 

జరిగింది ఇదీ... 

2018లో అప్పటి పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన మేరకు మద్దులపల్లిలో మార్కెట్​యార్డుకు 23.28 ఎకరాల భూమి కేటాయించారు. అప్పట్లో రూ.15 కోట్లు  మంజూరు చేశారు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, కేటాయించిన భూమికి రోడ్డు సమస్య తలెత్తడం, కొంత ప్రైవేట్ వ్యక్తుల భూమి సేకరించాల్సి రావడం లాంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. సమస్యలన్నీ తొలగిన తర్వాత 2022 మే 4న మార్కెట్​ నిర్మాణానికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక కాంట్రాక్టర్​ రిక్వెస్ట్ మేరకు అంచనాలను సవరించి రూ.19.90 కోట్లకు పెంచారు. 

ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్​ పనులు ఆలస్యం చేస్తుండడంతో, ఆ కాంట్రాక్ట్​ను రద్దు చేసి మరోసారి టెండర్లు పిలిచారు. ఈసారి ఖమ్మానికి చెందిన ఒక సంస్థ టెండర్​ దక్కించుకోగా, పాలేరు నియోజకవర్గానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత సబ్​ కాంట్రాక్టర్​ గా మారారు. అదే సమయంలో ఖమ్మం, సూర్యాపేట హైవే నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పనులకు మట్టిని అమ్ముకోవడంతో పాటు, ప్రైవేట్ వెంచర్లకు కూడా తరలించారన్న ఆరోపణలున్నాయి. 

ఇక ఇప్పటి వరకు రూ.2.26 కోట్లు కాంట్రాక్టర్​ కు చెల్లించగా, ఫీల్డ్ లో నిర్మాణ పనులు మాత్రం ఆ స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. జంగిల్ కటింగ్, లెవలింగ్ పేరుతో కాగితాలపైనే పనులు చూపి బిల్లులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. బిల్డింగ్ కోసం కట్టిన పిల్లర్లు నాసిరకంగా ఉండడం, బీములు వంకర్లు తిరగడం, బీముల్లో ఉపయోగించిన ఐరన్​ కడ్డీలు​సైతం బయటకు కనిపిస్తుండడంపై ఫొటోలను స్థానికులు అధికారులకు చూపించారు. మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో  రెండ్రోజులుగా కొందరు కూలీలతో పిల్లర్ల క్వాలిటీ బయట పడకుండా ప్యాచ్​ వర్క్ లు, ప్లాస్టరింగ్​ చేయించారని కంప్లైంట్ చేశారు.

పనుల్లో నాణ్యత లేదు

ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​ పనుల్లో నాణ్యత లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్​మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​ పనులతో పాటు జేఎన్​టీయూ, నర్సింగ్​ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్​ వీపీ గౌతమ్​తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్​ నిర్మాణ పనులు అడ్డగోలుగా చేశారని, ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా ఊరుకునేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. 

పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ కాకుండా అర్హత లేని వ్యక్తులకు పనులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఎవరి ఇష్టానుసారం వారు పనులు ఇచ్చుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలను వెంటనే పరిశీలించి అదనంగా డబ్బులు చెల్లిస్తే ఆర్ఆర్​ యాక్ట్ ద్వారా రికవరీ చేయాలని కలెక్టర్​వీపీ గౌతమ్​ను ఆదేశించారు. 

గతంలో మార్కెట్​స్థలంలో ఉన్న మట్టి గుట్టలను ఎత్తుకుపోయి సొమ్ము చేసుకున్నారని ప్రజలు కంప్లైంట్​ చేస్తున్నారని, ఎత్తైన కొండలు, గుట్టలను తొలగించి మళ్లీ ఫిల్లింగ్ ​చేయాల్సి అవసరం ఏంటని అధికారులను అడిగారు. మార్కెట్​నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలినవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భూములు ఆక్రమణపై అనేక దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ విచారిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్​ పరిసర ప్రాంతాల్లో రైతుల భూములును సైతం సర్వే చేసి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్​ రామకృష్ణను ఆదేశించారు. 

అనంతరం జేఎన్టీయూ కళాశాల నిర్మాణం కోసం కేటాయించిన 47 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెంగ్​ శాఖ ఈఈ రంగు లక్ష్మ్​ణ్​ గౌడ్​, డీ.కరుణాకర్, మద్దులపల్లి సర్పంచ్​ సుభద్ర, మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు, కాంగ్రెస్​ నాయకులు ధరావత్​ రామ్మూర్తి నాయక్​, మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, అంబటి సుబ్బారావు, బండి జగదీశ్, మద్ది మల్లారెడ్డి, ఏటూకూరి సుధాకర్, నమ్మినేని నవీన్, సప్పడి ప్రభాకర్, సీపీఐ నాయకులు దండి సురేశ్​పాల్గొన్నారు.

విలువైన మరో స్థలాన్ని పాడు చేసిన్రు!

మార్కెట్​యార్డులోని మట్టిని బయటకు తరలించిన బీఆర్ఎస్​ నేత, మెయిన్​ రోడ్డు నుంచి మార్కెట్ యార్డు వరకు 100 ఫీట్ల రోడ్డు మంజూరు కాగా ఆ రోడ్డు పనులకు అవసరమైన మట్టి కోసం విలువైన మరో స్థలాన్ని పనికిరాకుండా చేశారన్న విమర్శలున్నాయి. మద్దులపల్లిలోని వైటీసీ బిల్డింగ్ పక్కన రెండు ఎకరాల భూమిని ఆంధ్రాబ్యాంక్​ సొసైటీకి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. 

దాంట్లో 20 అడుగుల లోతు గోతులు తవ్వి, మట్టి మొత్తాన్ని మార్కెట్​రోడ్డు నిర్మాణం కోసం తరలిస్తుండడంపై స్థానికులు అబ్జెక్షన్​ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా, బీఆర్ఎస్​ నేత తీరుకు భయపడి పట్టించుకోలేదు. గోతులు పడిన భూమి ఇప్పుడు కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి పనికిరాకుండా  చేశారని మంత్రి పొంగులేటికి మద్దులపల్లి వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల తీరుపై అక్కడే మంత్రి సీరియస్​ అయ్యారు. మార్కెట్ పనుల తీరుమీద తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.