నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  •     మెరుగైన వైద్య సేవలు అందాలి
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  •     తిరుమలాయపాలెం ప్రభుత్వాసుపత్రి తనిఖీ
  •     సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం

ఖమ్మం, వెలుగు : ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార  శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషంట్ రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విధుల్లో లేని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతి లేకుండా గైర్హాజరైన వారిపై సంజాయిషీకి ఆదేశించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, తిరుమలాయపాలెం ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

సాగునీరు ఇస్తాం 

కూసుమంచి :  యాసంగి వరి పంటలకు మూడు తడుల సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో మంగళవారం మాజీ సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్​రావు ఆయకట్టు రైతులతో కలిసి మంత్రికి సాగునీరు కావాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు జలాశయం నుంచి పదివేల ఎకరాలకు పాత కాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఇరిగేషన్​ సీఈతో మాట్లాడి నీళ్లు వదులుతామని చెప్పారు. 

చెక్కుల పంపిణీ.. బాధితులకు పరామర్శ 

కూసుమంచి/ఖమ్మం రూరల్ :  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూసుమంచి మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పొంగులేటి మంగళవారం పంపిణీ చేశారు. కూసుమంచి, ఖమ్మం రూరల్​ మండలాల పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.