మొదట ఇళ్లు, రెండో విడతలో స్థలాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మొదట ఇళ్లు, రెండో విడతలో స్థలాలు : పొంగులేటి  శ్రీనివాసరెడ్డి
  •    మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : అర్హులైన పేదలందరికీ మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ఖమ్మం ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ సభ్యుడికి రాని మెజార్టీ రఘురాంరెడ్డికి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్ని పూర్తి చేస్తానన్నారు.

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. రాబోయే మూడేండ్లలో పాలేరులోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అతికొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ  తీపి కబురు అందుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు

స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలోని మూడు మండలాలకు జరిగిన క్రికెట్ పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. కూసుమంచి మండలం మల్లేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేత టీమ్ (నేస్తం వెల్ఫేర్ సొసైటీ–కూసుమంచి), ఎంపీటీసీ ఉపేందర్, కొండా మైపాల్​పాల్గొన్నారు.