ఖమ్మం జిల్లా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. మూతబడ్డ పాఠశాలల వివరాలు సమర్పించాలి, వాటిని పునఃప్రారంభం చేయుటకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి. స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో మహిళల ప్రయాణికులు పెరిగినట్లు, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని.. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. NSP,SRSP మంజూరు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరయిన మినీ స్టేడియం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంచే చేపట్టే పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పురోగతిలో సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని... ప్రజలకు మంచి సేవలు అందించడానికి అధికారులు బాధ్యతగా పని చేయాలని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.