అధికారుల పని బాగుంటేనే జిల్లా అభివృద్ధి : మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్ల పనితీరు బాగుంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. చుంచుపల్లి మండలంలోని మంత్రి క్యాంప్​ ఆఫీస్​లో బుధవారం జిల్లా ఆఫీసర్లతో డెవలప్​మెంట్​ వర్క్స్​పై రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఏమేం పనులు జరుగుతున్నాయో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఆఫీసర్లు ఒకరినొకరు కో ఆర్డినేషన్​ చేసుకుంటూ వర్క్స్​ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సీఎస్​ఆర్​ ఫండ్స్​ నిర్వీర్యం అవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. 

సీఎస్​ఆర్​ ఫండ్స్​ను పూర్తి స్థాయిలో వినియోగించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సీపీవోకు సూచించారు. పంచాయతీ సెక్రటరీలతోపై డీపీవో, తహసీల్దార్లపై ఆర్డీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పనిచేసే పంచాయతీ సెక్రటరీలు నివాసం ఓ చోట, విధులు మరో నిర్వహిస్తుండడంతో గ్రామాలపై వారికి పట్టు ఉండడం లేదని చెప్పారు. అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్​ కలెక్టర్లు అన్ని శాఖల ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు సాగేలా చూడాలని సూచించారు. 

రెడ్డి వనమహోత్సవంలో.. 

లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇల్లెందు క్రాస్​ రోడ్డు ప్రాంతంలోని సెంట్రల్​ పార్క్​లో బుధవారం ఏర్పాటు చేసిన రెడ్డి వనమహోత్సవంలో మంత్రి మాట్లాడారు. రెడ్డి బంధువులంతా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ ప్రోగ్రాంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు లేళ్ల వెంకటరెడ్డి, జమలా రెడ్డి, మన్నెం జవహర్​ రెడ్డి, కె. శ్రీనివాస్​ రెడ్డి, వై. శ్రీనివాస్​ రెడ్డి, పి. శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

కూసుమంచి :  మండల పరిధిలోని ముత్యాల గూడెం, చేగొమ్మ, జీళ్లచెరువు గ్రామాల్లో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కాంగ్రెస్​ నాయకులు సుధాకర్​రెడ్డి, మంకెన వాసు, సూర్యానారాయణరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.