అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని విజయరామ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన పాలేరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రస్తుతం జర్నలిస్టు ఇండ్ల సొసైటీ సమస్య సుప్రీం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ గురించి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి క్యాంపు ఆఫీస్​ ఇన్​చార్జి తుంబూరి దయాకర్​రెడ్డి,పాలేరు నియోజకవర్గంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.