అధైర్య పడొద్దు..  అండగా ఉంటాం

అధైర్య పడొద్దు..  అండగా ఉంటాం
  • నష్టపోయిన ప్రతి ఇంటికీ సాయం అందుతుంది
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్/నేలకొండపల్లి/కుసుమంచి/కారేపల్లి, వెలుగు : ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం గ్రామాల్లో, నేలకొండపల్లి మండలంలోని చెరువుమదారం,  కట్టుకాచారం రామచంద్రాపురం, సుర్దేపల్లి, కూసుమంచి మండలం తుమ్మల తండ, పాలేరు, నానుతాండ, నర్సింహులగూడెం  గ్రామాల్లో  బుధవారం ఆయన పర్యటించారు. నిత్యవసర సరుకుల కిట్​ అందజేశారు.

రహదారుల రిపేర్లు, బాధితుల వివరాలు, తక్షణ సహాయంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. విద్యుత్ రిపేర్లు వేగంగాచేపట్టాలన్నారు. కుసుమంచి మండలం పరిధిలో వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన షేక్​యాకూబ్​,సైదాబీ వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ,10 లక్షల  ఎక్స్ గ్రేషియాను మంత్రి, కలెక్టర్ అందజేశారు.

మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచిలో ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో జీ గణేశ్, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి, మున్సిపల్ డీఈ ధరణి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Also Read :- మొర్రెడు-కిన్నెరసాని వాగుల మధ్య చిక్కుకున్న గొర్రెల కాపర్లు

 దేశం గొప్ప యువ సైంటిస్ట్ ని కోల్పోయింది 

దేశం గొప్ప యువ సైంటిస్ట్ అశ్వినిని కోల్పోవడం బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆకేరు వరద ప్రవాహంలో మృతి చెందిన తండ్రీ కూతుర్ల కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను, ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని గంగారాం తండాలో బాధిత కుటుంబానికి బుధవారం సాయంత్రం మంత్రి అందజేశారు. కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్, పగడాల మంజుల, దుగ్గినేని శ్రీనివాసరావు, ఇమ్మడి తిరుపతిరావు, బానోత్ రామ్మూర్తి, దేవుల నాయక్, నర్సింగ్ శ్రీనివాస్, ఐలయ్య, మేదరి టోనీ, సంతోష్ పాల్గొన్నారు.