- ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం
- రైతులెవరూ సహనం కోల్పోవద్దు
- వరంగల్ టెక్స్ టైల్ పార్కును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతం
- పరకాలలో అభివృద్ధిపై రెవెన్యూ మంత్రి రివ్యూ
హనుమకొండ, పరకాల, వెలుగు: రుణమాఫీ కింద ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.19 వేల కోట్లు జమ చేశామని, అర్హులైన మిగిలిన రైతులకు రూ.12 వేల కోట్లు కూడా రిలీజ్ చేస్తామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు రైతు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, జిల్లా అధికారులతో ఆదివారం ఆయన రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ డబ్బులు రాని రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. బీఆర్ఎస్పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, రైతులెవరూ సహనం కోల్పోవద్దని కోరారు. ధనిక రాష్ట్రమని హెచ్చులు చెప్పుకోకుండా రూ.7లక్షల 18 వేల కోట్ల అప్పుల భారమున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రణాళికబద్దంగా పని చేస్తున్నామన్నారు.
ఇది ఇందిరమ్మ రాజ్యమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే.. తట్టుకోలేని కొంతమంది ఉక్రోషంతో నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన మూడు నెల్లలోనే 31 వేల ఉద్యోగాల ఇచ్చామని, టీజీ పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 4, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.
ఇండస్ట్రీల ఏర్పాటుకు కంపెనీలు సుముఖం
వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని, కానీ అవి మాటలకే పరిమితమయ్యాయని పొంగులేటి విమర్శించారు. గతంలో వచ్చిన కంపెనీలు పూర్తిగా గ్రౌండ్ కు రాలేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని పలు కంపెనీలు తమ దృష్టికి తీసుకొచ్చాయన్నారు. రెండు నెలల కిందట టెక్స్ టైల్ పార్కును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, సీఎం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ పరిష్కరించి, వరంగల్ టెక్స్ టైల్ పార్క్‌ను ప్రపంచానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.
ఇటీవల దక్షిన కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడి బడా కంపెనీలతో చర్చలు జరిపారని, ఇక్కడ ఇండస్ట్రీల ఏర్పాటుకు వారు సుముఖంగా ఉన్నారన్నారు. తొందర్లోనే వివిధ కంపెనీల ప్రతినిధులు పార్క్‌ను సందర్శిస్తారని చెప్పారు. వరంగల్ జిల్లాలోని కొనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను తొందర్లోనే ప్రారంభిస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.