
ఖమ్మం రూరల్, వెలుగు : మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ టీసీవీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వేల మందికి తగ్గకుండా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అర్హులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మసీదుల్లో తాగునీరు, విద్యుత్ ఏర్పాటు చేసేలా జిల్లా అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రతీ మసీదుకు రూ.లక్ష చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మైనారిటీల కోసం షాదీఖానా నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఈద్గా అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలన్నారు. గత సెప్టెంబర్ లో వచ్చిన భారీ వరదల సమయంలో సుభాని అనేక మంది ప్రాణాలు కాపాడారని, రంజాన్ పండుగ సందర్భంగా అతడికి ఇందిరమ్మ ఇండ్ల కాలనీలో ఒక ఇంటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి మసీదులో విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పోలీస్ భద్రత లాంటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో కుమార్, అధికారులు పాల్గొన్నారు.