విద్యారంగ అభివృద్ధికి కృషి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

విద్యారంగ అభివృద్ధికి కృషి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  
  • పలు స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన 
  • పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ 

ఖమ్మం రూరల్, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ. 637 కోట్ల ఖర్చు చేసి ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ, బారుగూడెం గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో రూ.13.50 లక్షల చొప్పున నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గోళ్లపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ  స్కూళ్లను ప్రైవేటు కు దీటుగా తీర్చిదిద్దామన్నారు. వసతులతో పాటు, ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టినట్లు తెలిపారు. 

పైలట్ ప్రాజెక్ట్ గా పాలేరు నియోజకవర్గ ప్రతి మండలానికీ ఒక హైస్కూల్ లో పూర్తి స్థాయిలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగివుంటుందని, దాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, మూడు శాఖలు మధిర, హుజూరాబాద్, ఆదిలాబాద్ లో ఏర్పాటు అవుతాయని, త్వరలో పాలేరులో కూడా దీని శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి, డీఈవో సోమశేఖరశర్మ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్​ బాబు, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంఈవో శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.