బీజేపీ, బీఆర్ఎస్​కు డిపాజిట్లు కూడా రావు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  •     మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి, వెలుగు : బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒకటేనని, ఆ పార్టీల అభ్యర్థులకు రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్​ఎస్​ పదేండ్లు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. రాష్ట్రం విభజన అనంతరం ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. అందరివాడైన రాముడి పేరుతో  బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి కేసీఆర్​ శనిలా దాపురించారని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

ఖమ్మం లో నామాను  గెలిపిస్తే మంత్రిని చేస్తానంటున్నాడని, దీంతోనే  బీజేపీతో బీఆర్​ఎస్​కు ఉన్న లోపాయికారి ఒప్పందం తెలిసిపోతోందన్నారు. ఈ  రెండు పార్టీలకు పార్లమెంట్​ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.   

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి

ఖమ్మం టౌన్ :  మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి అన్నారు. బుధవారం నగరంలోని టీడీపీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డితో కలిసి వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి ఆయన, రఘురాంరెడ్డి  కార్డులపై సంతకాలు చేసి పోస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. పోలీస్ హౌసింగ్ కాలనీలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు చావా శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరయ్యారు.  రాఘురాంరెడ్డికి భారీ మెజార్టీ అందిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ పలువురి చేరిక.. 

చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి పంచాయితీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ జిల్లా లీడర్లు, పలువురు ప్రజాప్రతినిధులు బుధవారం మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిప్పనపల్లి ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ లీడర్ తాళ్లూరి వెంకటేశ్వరావు, పలువురు వార్డు సభ్యులకు మంత్రి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.