- కాంగ్రెస్ ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- పాల్వంచ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం
పాల్వంచ, వెలుగు : జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాల్వంచలో జెన్కో కేటాయించిన స్థలంలో శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేశ్‌రెడ్డి నేతృత్వంలో కొత్తగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని, తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకోవచ్చని తెలిపారు
. తప్పులు ప్రభుత్వం చేసినా, ప్రతిపక్షం చేసినా విలేకరులు ధైర్యంగా వార్తలు రాసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైఎస్సార్ హయాంలో హైదరాబాద్‌లో 72 ఎకరాల భూమిలో 1,050 మంది విలేకరులకు ఇంటి పట్టాలు ఇచ్చినా, గత ప్రభుత్వంలో కోర్టులో విలేకరులకు స్థలాలు ఇచ్చేలా తీర్పు వచ్చినా ఆ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ స్థలాలను తమ ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించి అందరి సమక్షంలో అందజేస్తామని చెప్పారు. కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పట్టించుకోబోమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేటీపీఎస్ ట్రైనింగ్ సెంట ర్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస బాబు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరా వు, ఏపీఆర్వో అస్గర్ అలీ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే షాబీర్ పాషా, ప్రెస్ క్లబ్ నిర్మాణ దాత నల్ల సురేశ్‌రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుభాని, గౌర వాధ్యక్షుడు సంజీవ్ కుమార్, సలహాదారులు చండ్ర నర సింహారావు, కోశాధికారి రజాక్, ఉపాధ్యక్షులు వెంకటనా రాయణ, పలువురు వివిధ పార్టీలు, జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమానికి కృషి
కూసుమంచి : గీత కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచి క్యాంపు ఆఫీస్‌లో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు తాటి చెట్లు ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, ఆధునిక టెక్నాలజీ తో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు.
బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లు గీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం, హైదరాబాద్ సహకారంతో సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. గీత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామని, వన మహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలన్నారు.
ప్రమాదానికి గురై మరణించిన గీత కార్మికులకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, జిల్లా సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, ఇర్రిగేషన్ ఈఈ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.