జూలూరుపాడు/కూసుమంచి, వెలుగు : సంక్రాంతికి రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకుంటామని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజా పాలనా విజయోత్సవం సందర్భంగా మంగళవారం జూలూరుపాడు మండలంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి మంత్రి పర్యటించారు. రూ.3.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశచరిత్ర లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈనెల 5 నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి విడుతలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లు ఇస్తామని తెలిపారు. వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో18.57 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ప్రస్తుతం10 నెలల ఇందిరమ్మ పాలనలో 53వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
అనంతరం పడమటి నర్సాపురంలోని ఆశ్రమ స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాభోదనతో పాటు , పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో మధు, డీఎస్పీ అబ్దుల్ రహమాన్, తహసీల్దార్ స్వాతి బిందు, ఎంపీడీవో రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, లేళ్ల వెంకట రెడ్డి, మంగీలాల్, అధికారులు, తదితరులు
పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
-కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో ధాన్యం కొనుగొలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. మండలంలోని మల్లెపల్లి, గట్టుసింగారం, కూసుమంచి, నర్సింహులగూడెం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో60 మంది లబ్ధిదారులకు రూ. 17.28 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ సంవత్సరం కింద ఇదే రోజు పది సంవత్సరాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.7.19 లక్షల కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుతం అప్పు కింద ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని తెలిపారు. గతప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం మెస్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల 77 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.