అర్హులందరికీ ఇండ్లు, స్థలాలు ఇస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/నేలకొండపల్లి, వెలుగు :  అర్హులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం కూసుమంచి మండల కేంద్రంతోపాటు, జీళ్లచెరువు గ్రామంలో  సీసీ రోడ్ల పనులు, నేలకొండపల్లి మండల చెరువుమాధారం, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్ కైకొండాయగూడెంలో సీసీ రోడ్ల పనులకు, నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామం రాజేశ్వరపురం-, పోలారం-, జక్కేపల్లి ఆర్ అండ్ బీ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన  చేశారు. 

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు. ఇంటర్నల్​ రోడ్లను నిర్మాణాలను రెండు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామన్నారు.  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్టు బీజేపీ, బీఆర్​ఎస్​ రాజకీయ డ్రామాలన్నారు. 

కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ,  పబ్లిక్ హెల్త్ ఈఈ  రంజిత్, మున్పిపల్ ఈఈ కృష్ణలాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.