ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అందజేస్తున్నామన్నారు. బీజేపీ మతం, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని కుటిలయత్నం చేస్తోందని ఆరోపించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టీచర్ల, పెన్షనర్ల సమస్యను పరిష్కరిస్తాం
ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. సోమవారం ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయుల ఫోరం కన్వీనర్ మోత్కురి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను మంజూరు చేసే విషయంపై దృష్టి పెడతామన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో జూన్ లో సమావేశం ఏర్పాటు చేసి కరువు భత్యం, వేతన సవరణ తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పూల రవీందర్, టీచర్లు దామోదర్ రెడ్డి,దుర్గారావు,చంద్రశేఖర్, వెంకట నర్సయ్య, మల్లికార్జున్ శర్మ, సాధు లక్ష్మణ్ రావు, కొత్తా శ్రీనివాసరావు పాల్గొన్నారు.