యుద్ద ప్రాతిపదికన కాల్వలు పునరుద్ధరించాలి

యుద్ద ప్రాతిపదికన కాల్వలు పునరుద్ధరించాలి

 

  •  వరదలతో రూ. 10,300 నష్టం వాటిల్లింది

  • ఇండ్లు కోల్పోయిన వారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు

  •  సాయం కోసం ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలుస్తా

  •  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం: జిల్లాలోని పాలేరు ఎడమ కాల్వకు పడిన గండి పనులను 24 గంటలూ కొనసాగేలా చేసి నాలుగురోజుల్లో పంటలకు నీళ్లు వదలాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలో ఇవాళ ఆయన పర్యటించారు. ముందుగా కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో దాదాపు 10 వేల 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.  ఇండ్లు కోల్పోయిన వారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తాం. వరద సాయం కోసం వారంలోగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానన్నారు. గండి పూడిక వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులపై ఆరా తీశారు. కాల్వ శాశ్వత పునరుద్ధరణ పనులను కూడా సమాంతరంగా నిర్వహించాలని సూచించారు. గంటల వ్యవధిలో 37 నుండి 38 సెం.మీ. మేర కుంభవృష్టి వర్షం పడింది. 

ALSO READ | వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

ఇండ్లు, పశువులు, పంట పొలాలు, రోడ్లు, బ్రిడ్జి కొట్టుకుపోయి పెద్ద ఎత్తున నష్టపోయాం అన్నారు. వరద సాయం కోసం వారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తానని చెప్పారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలు నష్టపరిహారం అందిస్తాం. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, కట్టు కాచారం, తిరుమలాయపాలెం మండలం రావిచెట్టు తండ వద్ద దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి, విద్యుత్ స్తంభాలు పరిశీలించి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.