ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం రూరల్, కుసుమంచి మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం కైకొండాయగూడెంలో టీయూఎస్ఐడీసీ నిధులు రూ. 1.95 కోట్లు, 59వ డివిజన్ దానవాయిగూడెం లో రూ.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మున్నేరు వరద ముంపు ప్రాంతాలు రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలనీ, కరుణగిరి, జలగం నగర్లలో బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోందని అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో రూ.2కోట్ల నిధులతో 12 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో రూ.1.30కోట్లకు డ్రైయిన్, రోడ్ల పనులు చేపట్టామని, అవి నేడు చివరి దశకు చేరుకున్నాయన్నారు.
శ్మశానవాటిక నిర్మాణానికి టెండర్ పూర్తి చేశామని, త్వరలో ఆ పనులు పూర్తవుతాయని చెప్పారు. కేఆర్ ఫంక్షన్ హాల్ నుంచి స్కూల్ వరకు లింక్ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్పై తిరుగుతూ పరిశీలించారు. బాధితులను సంపూర్ణంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. అధికారులు ముంపు ప్రాంతాల్లోనే సహాయక కేంద్రం, మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి అందజేస్తారని చెప్పారు.
పాలేరు ఎడమ కాల్వ పరిశీలన
కూసుమంచి మండలంలోని పాలేరు ఎడమ కాల్వ గండిని పూడ్చి మంగళవారం తెల్లవారుజామున నీటి విడుదల చేయగా మంత్రి పర్యవేక్షించారు. వరదల్లో గండిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంత్రి ప్రారంభించారు. ఇందులో 50 మంది విద్యార్థులు చేరగా మరో 20 రోజుల్లో 70 మంది చేరుతారని ఆయన చెప్పారు. కాలేజీ సొంత భవన నిర్మాణానికి రూ 5.5 0 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
1.10 ఎకరాల భూమిని కేటాయించామన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ 23.50 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండలంలో 102 మంది బాలికలకు ఉచిత సైకిళ్ల ను పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ పరిధిలో రాష్ట్ర ఇర్రిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, మున్సిపల్ డీఈ ధరణి, కుసుమంచి మండల పరిధిలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు.