- దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి పొంగులేటి
- బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు: మంత్రి సీతక్క
- తల్లుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: పొంగులేటి
మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులందరూ తమకు వీఐపీలేనని, ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం అన్ని సౌలతులు కల్పించామని రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో మేడారం మహాజాతరకు పనిచేసిన అనుభవం ఉన్న ఆఫీసర్లకే డ్యూటీలు వేశామని చెప్పారు. సోమవారం మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఆఫీసర్లతో ఆయన రివ్యూ చేశారు. అంతకుముందు మేడారంలో రూ.10 లక్షలతో నిర్మించిన మీడియా సెంటర్‌ను మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహిస్తామన్నారు. మేడారం వచ్చే భక్తులందరూ తమకు వీఐపీలతో సమానమని, అందుకే ప్రత్యేక శ్రద్ధతో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 58 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని చెప్పారు. నాలుగు రోజుల మహాజాతరలో రెండు కోట్ల మంది భక్తులు మేడారం రానున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. మేడారం వచ్చే భక్తులకు రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రం నలుమూలల నుంచి 6 వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి స్కీం ద్వారా ఇప్పటి వరకు 17 కోట్ల మంది ఆడబిడ్డలు జీరో టికెట్ తో ప్రయాణం చేశారని తెలిపారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఆడబిడ్డలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున బస్సుల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పారిశుధ్య నిర్వహణకు నాలుగు వేల మంది కార్మికులను ఏర్పాటు చేశామన్నారు. 270 కి.మీ. పొడవునా రోడ్లను అభివృద్ధి చేశామని, తాగునీటికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
మేడారంలో శాశ్వత పనులు చేపడతం: సీతక్క
మహాజాతరకు రెండు నెలలు ముందు నుంచే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ముందస్తు దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే ప్రథమమని ఆమె తెలిపారు. నిరంతరం మేడారం పనులు పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాగానికి ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడారం మహాజాతర కోసం వచ్చే భక్తులు సులభంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో జాతరకు రావాలని భక్తులకు మంత్రి సూచించారు.
ఇది రాష్ట్ర పండుగ అని జాతర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని మీడియాను కోరారు. మేడారంలో శాశ్వత పనులు చేపడతామని చెప్పారు. తల్లుల కీర్తి ప్రతిష్టలు శిలాశాసనం చేసి చరిత్ర లికించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అధికారులందరు జాతర విధుల్లో ఉన్నందున గ్రామాల్లో మంచి నీరు, ఇతర సమస్యలు ఎదురైతే స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని, ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ డాక్టర్ శబరీశ్ తదితరులు ఉన్నారు.